True lover review: చిత్రం: ట్రూ లవర్, నటీనటులు: మణికందన్.కె, గౌరీ ప్రియా రెడ్డి, కన్నా రవి, శరవణన్ తదితరులు, సంగీతం: సీన్ రోల్డాన్, ఛాయాగ్రహణం: శ్రేయాష్ కృష్ణ, దర్శకత్వం: ప్రభురామ్ వ్యాస్, నిర్మాతలు: మారుతి, ఎస్‌కెఎన్, విడుదల తేదీ: 10-02-2024


జై భీమ్.. గుడ్‌నైట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు కె.మణికందన్ (manikandan), గౌరీ ప్రియ జంటగా ప్రభురామ్ తెరకెక్కించిన చిత్రం ‘ట్రూ లవర్’. బేబీ సినిమాతో హిట్టు కొట్టిన నిర్మాత ఎస్‌కెఎన్‌తో కలిసి దర్శకుడు మారుతి (Maruthi) దీన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పాటలు, ప్రచార చిత్రాలతో యువతరం దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా శనివారం థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ ‘ట్రూ లవర్’ కథేంటి? (True lover) అది సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతి అందించింది? తెలుసుకుందాం పదండి..
కథేంటంటే: అరుణ్ (మణికందన్), దివ్య కాలేజీ రోజుల నుంచి ప్రేమలో ఉంటారు. దివ్య కాలేజీ పూర్తి కాగానే ఓ మంచి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది. అరుణ్ మాత్రం కేఫ్ పెట్టాలనే ప్రయత్నాలు చేస్తూ ఖాళీగా తిరుగుతాడు. అతడికి తన ప్రేమ విషయంలో అభద్రతా భావం ఎక్కువ. ఈ కారణంగా దివ్యపై తరచూ అనుమాన పడుతుంటాడు. ఆమె తోటి అబ్బాయిలతో మాట్లాడినా.. చెప్పకుండా ఎక్కడికి వెళ్లినా అసలు సహించడు. ప్రతి విషయంలోనూ ఆమెను నియంత్రించాలని చూస్తుంటాడు. ఫలితంగా ఇద్దరు తరచూ గొడవపడుతూ విడిపోయి.. మళ్లీ కలిసిపోతుంటారు. అరుణ్ ప్రవర్తనతో విసిగిపోయిన దివ్య ఓ దశలో అతని నుంచి పూర్తిగా దూరం కావాలని నిర్ణయించుకుంటుంది. అలా కొన్నాళ్లు ఇద్దరి మధ్య మాటలుండవు. అరుణ్ వాళ్ల అమ్మ ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిశాక దివ్య మళ్లీ అతనితో మాటలు కలుపుతుంది. ఆ తర్వాత ఆమె పుట్టినరోజు పార్టీకి ఆహ్వానించగా.. అక్కడ మళ్లీ పెద్ద గొడవ అవుతుంది. దీంతో ఇద్దరూ మళ్లీ విడిపోతారు. ఆ తర్వాత దివ్య తన ఆఫీస్ ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్‌కు వెళ్తుంది. అది తెలిసి అక్కడికి అరుణ్ కూడా వెళ్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? వీళ్లిద్దరు మళ్లీ కలిశారా? విడిపోయారా? అరుణ్ వాళ్ల అమ్మ ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారణమేంటి? అతడు కేఫ్ పెట్టాలన్న లక్ష్యం నెరవేరిందా?లేదా? అన్నది మిగతా కథ (True lover review).
ఎలా సాగిందంటే: ప్రేమలో నమ్మకం ఉన్నప్పుడు ఎలాంటి అపార్థాలకు.. గొడవలకు చోటుండదు. అదే ఆ జంటలో ఏ ఒక్కరిలో అనుమానం.. అభద్రతా భావం ఉన్నా అది ఇద్దరినీ తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తుంది. ఈ సినిమా అలాంటి ఓ జంటకు సంబంధించిన ప్రేమకథతోనే రూపొందింది. అనుమానపు ప్రేమ వల్ల ఓ యువ జంట ఎంత మానసిక వేదన అనుభవించింది.. ఈ క్రమంలో వాళ్ల జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయి అన్నది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. ఇది పూర్తిగా ఓ చిన్న లైన్‌పై సాగే చిత్రం. హీరోహీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమలోని సమస్యను చూపిస్తూ ఈ సినిమా ఆసక్తికరంగానే మొదలవుతుంది. దివ్య ఎవరితో మాట్లాడినా అరుణ్ అనుమానంతో మితిమీరి ప్రవర్తించడం.. దీంతో అతని దగ్గర ఆమె నిజాలు చెప్పలేక తన సంతోషాలన్నీ చాటుమాటుగా వెతుక్కోవడం.. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తలెత్తే విభేదాలు.. గొడవలు.. బ్రేకప్ చెప్పడం.. మళ్లీ తిరిగి కలిసిపోవడాలు.. ఈ తతంగమంతా ఆరంభంలో కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది. చాలా సన్నివేశాలు నేటి యువత ఆలోచనా ధోరణికి అద్దం పట్టే విధంగా కనిపిస్తాయి. కానీ, ఓ దశ దాటాక ఇవే సన్నివేశాలు పదే పదే రావడం ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది. అసలు అరుణ్‌ను దివ్య ప్రేమించడానికి కారణమేంటో బలంగా చెప్పలేకపోయారు. అతను అనుమానంతో తరచూ వేధిస్తున్నా.. తనతో బంధాన్ని దేనికి కొనసాగిస్తుంటుందో అర్థం కాదు. అయితే వీళ్లిద్దరి మధ్య జరిగే కథను ఎంతో సహజంగా.. వాస్తవికతకు దగ్గరగా చిత్రీకరించిన తీరు మెప్పిస్తుంది. విరామ సన్నివేశాలు మరీ ఆసక్తిరేకెత్తించేలా లేకున్నా.. ఫర్వాలేదనిపిస్తాయి.
ద్వితీయార్ధమంతా కూడా అరుణ్ - దివ్య మధ్య జరిగే గొడవలతోనే సాగుతుంది. దాంట్లోనూ కొత్తదనం కనిపించదు. అరుణ్ ఇంట్లో అమ్మ నాన్నల రిలేషన్‌కు ఒక సమస్య పెట్టి ఆఖర్లో దాన్ని వీళ్ల కథకు కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు దర్శకుడు. నిజానికి ఈ రెండూ ఒకదానితో ఒకటి సంబంధంలేని కథల్లాగే ఉంటాయి. కానీ, వాటిని కనెక్ట్ చేసి ఏం సందేశం చెప్పాలనుకున్నాడో అసలు అర్థం కాదు(True lover review). అరుణ్‌కు.. తన తల్లికి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాల్ని చూపించిన తీరు బాగుంది. కొడుకు బాధ్యతగా లేకున్నా.. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుపడతాడకునే తల్లి పాత్రతో చాలా మంది కనెక్ట్ అవుతారు. క్లైమాక్స్‌ను తీర్చిదిద్దిన తీరు బాగుంది. పతాక సన్నివేశాల్లో కథానాయకుడు చూపించే యాటిట్యూడ్ కుర్రకారుకు బాగా నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే: అరుణ్ పాత్రలో మణికందన్ సహజంగా ఒదిగిపోయాడు. అభద్రతా భావంతో రగిలిపోయే ప్రేమికుడిగా.. తాగుబోతుగా.. తన నటన అందర్నీ కట్టిపడేస్తుంది. ముఖ్యంగా తాగిన తర్వాత ప్రేమించిన అమ్మాయిపై కోపంతో విరుచుకుపడటం.. మత్తు దిగాక క్షమించమంటూ బతిమాలుకోవడం వంటి సన్నివేశాలు ఓ వర్గం యువతకు బాగా కనెక్ట్ అవుతాయి. దివ్య పాత్రలో గౌరీ ప్రియ కూడా చక్కగా జీవించింది. ఆమెకు.. హీరోకు మధ్య వచ్చే ప్రతి సన్నివేశం చక్కగా పండింది. కాకపోతే వీళ్లిద్దరి ప్రేమకథలో అంత బలం కనిపించదు. అలాగే భావోద్వేగభరిత సన్నివేశాల్లో ఆమె నటన కట్టిపడేస్తుంది. స్నేహితుల పాత్రల్లో నటించిన వారంతా తెరపై ఎంతో సహజంగా కనిపించారు. దర్శకుడు తను ఎంచుకున్న కథను నిజాయితీగా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. అలాగే ఈతరం యువతకు కనెక్ట్ అయ్యేలా చాలా సన్నివేశాల్ని చక్కగా తీర్చిదిద్దుకున్నాడు. కాకపోతే లైన్ మరీ చిన్నదైపోవడం.. కథలో పెద్దగా బలం కనిపించకపోవడం.. రిపీట్‌నెస్ ఎక్కువవడమే దెబ్బతీసింది. ఇంత రస్టిక్ ప్రేమకథను కుటుంబ సమేతంగా చూడటం కాస్త కష్టమే అనుకోవచ్చు. సంగీతం కథకు తగ్గట్లుగా కుదిరింది. ఒకటి రెండు పాటలు వినసొంపుగా ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బాగా ఆకట్టుకుంటుంది. ఛాయాగ్రహణం చాలా సహజంగా ఉంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.
బలాలు: + కథా నేపథ్యం.. + మణికందన్, గౌరీ ప్రియ నటన + యువతను మెప్పించే కొన్ని సీన్స్.. ముగింపు
బలహీనతలు: - సాగతీత కథనం.. - ద్వితీయార్ధం
చివరిగా: ట్రూ లవర్.. కొంత మెప్పిస్తాడు.. ఇంకొంత విసిగిస్తాడు!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!